Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Confusion in transfers

బదిలీల్లో గందరగోళం

Confusion in transfers

  • టీచర్ల బదిలీలకు ఎన్ని ఇక్కట్లో.
  • నేటితో దరఖాస్తుల స్వీకరణకు గడువు పూర్తి
  • ఇంకా విడుదలకాని సీనియారిటీ జాబితాలు
  •  ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారులకు సాంకేతిక సమస్యలు
  • మెడికల్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు జడ్పీ చైర్మన్‌, సీఈవో, డీఈవోతో కమిటీ
  • స్పౌజ్‌ పాయింట్ల కేటాయింపులోనూ స్పష్టత శూన్యం
  • అయోమయంలో ఉపాధ్యాయులు

_జిల్లాలో టీచర్ల బదిలీల ప్రక్రియ సజావుగా సాగేలా లేదు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ఇప్పటికీ ప్రకటించకపోవడం, నేటితో దరఖాస్తుల గడువు పూర్తి అవుతున్నా బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటం, టీచర్ల పదోన్నతుల సమయంలో ఏ పాఠశాలకు పంపుతారో చెప్పకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఈ బదిలీలు సక్రమంగా జరుగుతాయో లేదోననే అయోమయం టీచర్లలో నెలకొంది._ 

టీచర్ల సీనియారిటీ జాబితాను గురువారం సాయంత్రానికి కూడా ప్రకటించలేదు. రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘ నాయకులు, మంత్రి బొత్స సత్యనారాయణతో గురువారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో టీచర్ల బదిలీల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించటంతో డీఈవో కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లాస్థాయి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈవో తాహెరా సుల్తానా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు విడుదల చేయకుండా బదిలీల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నించారు. గతంలో టీచర్ల బదిలీల కోసం ప్రభుత్వం 117 జీవోను జారీ చేసింది. ఈ జీవోలో విలీనమైన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయించలేదు. ఈ అంశంపై ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు కోర్టును ఆశ్రయించాయి. జూన్‌ ఒకటో తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు కావటంతో ఈ కేసులపై ఎలాంటి నిర్ణయమూ తీసుకునేందుకు అవకాశం లేని పరిస్థితి. మే 31వ తేదీ నాటికే టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో బదిలీల వ్యవహారంలో గందరగోళం నెలకొంది.

97 మంది పిల్లలకు ముగ్గురు ఎస్‌జీటీలే

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో టీచర్లు, విద్యార్థుల నిష్పత్తిని ప్రకటించింది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు నడుస్తున్న యూపీ పాఠశాలల్లో 97 మంది విద్యార్థులుంటే ముగ్గురు సెకండరీ గ్రేడ్‌ టీచర్లను ఉంచుతామనే నిబంధన విధించింది. ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్లు పాఠ్యాంశాలు బోధించాల్సి ఉండగా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి స్కూల్‌ అసిస్టెంట్లను ఇవ్వబోమని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపైనా ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలు జరిపారు.

ఎదురవుతున్న సాంకేతిక సమస్యలివీ

టీచర్లు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. 2015లో వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ అయిన టీచర్లు ఒకే పాఠశాలలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ తరహా ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో స్పౌజ్‌ కేసులుంటే ఆన్‌లైన్‌లో ఈ వివరాలు నమోదుకు అవకాశం ఉండటం లేదు. నూతన విద్యావిధానంలో పాఠశాలలు విలీనమైన సమయంలో కొందరు ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది. పాత పాఠశాలల్లో సర్వీసును పరిగణనలోకి తీసుకోమని చెప్పటంతో టీచర్లు పాయింట్లు కోల్పోతున్నారు. విలీనమైన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు 5 పాయింట్లు, రేషనలైజేషన్‌ పాయింట్లు 5 ఇచ్చారు. పాత పాఠశాలల్లో ఆరు నుంచీ ఏడు సంవత్సరాలు పనిచేస్తే ఏడాదికి మూడు పాయింట్ల చొప్పున టీచర్లు కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బదిలీల జాబితాలో సీనియారిటీ ఉన్న టీచర్లు వెనుకబడే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో టీచర్లు బదిలీకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో పాయింట్లు నమోదు చేసే కాలంలో ఖాళీ కనబడుతోంది. ఈ ఖాళీలో టీచర్లే పాయింట్లు నమోదు చేయాలని చెబుతున్నారు. కొందరు కావాలని అధిక పాయింట్లు నమోదు చేస్తే తమ పరిస్థితి ఏమిటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. టీచర్లు చేసుకున్న దరఖాస్తులను ఎమ్యీవోలు పూర్తిస్థాయిలో పరిశీలిస్తారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా బదిలీల కోసం దరఖాస్తులు చేసుకునే గడువు ఒకరోజే ఉండటంతో 27వ తేదీన ఈ జాబితాలను ఎమ్యీవోలు, డీఈవోలకు సమర్పించాల్సి రావటంతో మండల స్థాయిలో ఈ దరఖాస్తుల పరిశీలన ఎంతమేర జరుగుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని డీఈవోతో జరిగిన సమన్వయ సమావేశంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రస్తావించి బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని కోరారు.

ఫ్రిపరెన్షియల్‌ కోటాలో భార్యాభర్తలిద్దరూ టీచర్లయితే ఎవరికైనా ఒకరికి తీవ్ర అనారోగ్య సమస్యలుంటే సంబంధిత సర్టిఫికెట్లను మెడికల్‌ బోర్డు నుంచి తెచ్చుకోవాలని సూచించారు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఒక్కరోజే ఉండటంతో ఎప్పటికి ఈ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి? ఎప్పటికి దరఖాస్తు చేసుకోవాలని? అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

జడ్పీ ఛైర్మన్‌, సీఈవో, డీఈవోతో కమిటీ

అనారోగ్యపరమైన అంశాలతో బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే టీచర్ల దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, జడ్పీ సీఈవో, డీఈవోలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు అధికారపార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందనీ, వాస్తవంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉపాధ్యాయులను కాదని వేరొకరికి బదిలీల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేకపోలేదని ఉపాధ్యాయ సంఘ నేతలు అంటున్నారు. ఈ కమిటీ ప్రాధాన్యతను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పదోన్నతులు ఇచ్చేముందు ఖాళీలు చూపరట

టీచర్లకు పదోన్నతి ఇచ్చే సమయంలో ఏ పాఠశాలకు పంపుతారో చెప్పకుండానే పదోన్నతులు ఇస్తామని ప్రభుత్వం చెప్పటంపై టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతి పొందిన టీచర్లు ఏ పాఠశాలకు వెళ్లాలో ముందస్తుగా చెప్పకుండా, పదోన్నతి పొందిన పోస్టును మాత్రం ఖాళీగా చూపుతామని ప్రకటిం చారు. ఈ అంశంపైనా టీచర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి బొత్సతో జరిగిన సమావేశంలోనూ ప్రస్తావించారు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ నెలాఖరులోగా టీచర్ల బదిలీ ప్రక్రియ సజావుగా సాగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల సీనియారిటీ లిస్టులు విడుదల

మచిలీపట్నం టౌన్‌ : జిల్లాలో ఖాళీగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు డీఈవో తాహెరా సుల్తానా తెలిపారు. గురువారం డీఈవో మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీషు, మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ పోస్టులను అర్హత గల సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఇందుకుగాను సెకండరీ గ్రేడ్‌ టీచర్ల సీనియారిటీ జాబితాలను వెబ్‌సైట్‌లో ప్రకటించామన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఉమ్మడి, మండల విద్యాశాఖాధికారులకు ఈ జాబితాలు పంపించామన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు ఆసక్తి, అంగీకారం తెలిపే ఎస్‌జీటీలు ఈనెల 27న ఉదయం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి హాజరు కావాలన్నారు. రెండవసారి నిర్వహించిన హైస్కూల్‌ ప్లస్‌ బాలికల జూనియర్‌ కళాశాలల్లో 101 ఖాళీలకు కౌన్సెలింగ్‌ ద్వారా 57 మంది పీజీటీ పోస్టులు కోరుకుంటున్నారన్నారు. ఇంకా 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 276 పీజీటీ పోస్టులకుగాను మొదటి విడతగా 175, రెండవ విడతగా 57 పోస్టులు భర్తీ చేశామన్నారు. ఇలా 276 పోస్టులకు 232 పోస్టులు భర్తీ చేయగా ఇంకా 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం మూడో విడత కౌన్సెలింగ్‌కు అనుమతిస్తే ఈ పోస్టులు భర్తీ చేసేందుకు పిలుపునిస్తామన్నారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Confusion in transfers"

Post a Comment