Relieve those teachers.
ఆ ఉపాధ్యాయులను రిలీవ్ చేయండి.
జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో మూడేళ్లకు పైబడి పని చేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి వారిని పాఠశాలలకు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లో మూడేళ్లకు మించి ఉన్నవారికి ఝలక్
జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో మూడేళ్లకు పైబడి పని చేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి వారిని పాఠశాలలకు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వీరిలో చాలామంది ఏళ్ల తరబడి బోధనకు దూరమయ్యారు. కొంతమంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. వీరి స్థానాల్లో కొత్తవారిని తీసుకోవాలని, వచ్చే మంగళవారం నాటికి ఈ నియామకాలు పూర్తి చేయాలని డీఈవోలు, ఆర్జేడీని పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు పార్వతి టెలి కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ప్రస్తుతం పని చేస్తున్నవారిని శనివారం నాటికి సాగనంపాలని, ఈ ఆదేశాలను పాటించకపోతే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా డీఈవో కార్యాలయంలో 20 ఏళ్లుగా ఏఎస్‌వోగా పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడి పనితీరుపై అసంతృప్తి చెందిన అధికారులు ఆ బాధ్యతల నుంచి వైదొలగి తిరిగి ఉపాధ్యాయుడిగా పాత స్కూల్‌కు వెళ్లాలని ఆదేశించడం.. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.
రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు, ఉపాధ్యాయుల సమాచారం సేకరణ, అటెండెన్స్ వివరాలు తీసుకోవడానికి డీఈవో, ఆర్జేడీ కార్యాలయాల్లో కొంతమంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఈ విధులను నాన్ టీచింగ్ ఉద్యోగులతో చేయించొచ్చు. ఆ పనులను ఉపాధ్యాయులే చేయాల్సిన అవసరం లేదని, ఆ స్థానాల్లో మూడేళ్లకుపైగా పని చేస్తున్నవారిని సాగనంపాలని ప్రభుత్వం ఆదేశించింది.
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల విద్యాశాఖ కార్యాలయాలతోపాటు గుంటూరు ఆర్జేడీ కార్యాలయంలో కొంతమంది ఉపాధ్యాయులు తిష్ఠ వేశారు. వీరిని సాగనంపేందుకు, వీరి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు డీఈవోలు, ఆర్జేడీ దృష్టి సారించారు. ఏఎస్‌వో, ఏపీవోలుగా పని చేయడానికి ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ముందుకు రావాలని కోరుతున్నారు. ఏఎస్‌వోలుగా గణితం, భౌతికశాస్త్రం బోధించే స్కూల్ అసిస్టెంట్లను, ఏపీవోలుగా సెకండరీ గ్రేడ్ టీచర్లను డిప్యుటేషన్‌పై తీసుకుంటారు.
డైట్ కళాశాలలోనూ ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పిలిపించి, స్కూళ్లకు పంపితే సబ్జెక్టు టీచర్ల కొరత తగ్గుతుందని చెబుతున్నారు.
0 Response to "Relieve those teachers."
Post a Comment