District Collector hitting the door of the student's house ..
విద్యార్థి ఇంటి డోర్ కొట్టిన జిల్లా కలెక్టర్..
తెల్లవారుజామున పదవ తరగతి విద్యార్థి ఇంటి డోర్ తట్టి భరత్ చంద్ర ఉన్నారా ! ఆ ఉన్నారు మీరు ఎవరు అండి అని భరత్ తల్లి అంది.
నేను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుని అని సమాధానం ఇచ్చారు. అనంతరం తల్లి తన కొడుకు కోసం జిల్లా కలెక్టర్ ఎందుకు వచ్చాడని వెంటనే డోర్ తీసింది. నమస్కారం సార్ ఇంత ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు. ఏంటి సార్ అని తన తల్లి భరత్ ని తోడుకొని కలెక్టర్ వద్దకు వచ్చింది. భరత్ పదవ తరగతి చదువుతున్నాడు కదా తను ఎలా చదువుతున్నాడు పరిశీలిద్దాం అని వచ్చానని జిల్లా కలెక్టర్ సమాధానం ఇచ్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామునే జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి నాంది పలికారు. పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని భరత్ కు జిల్లా కలెక్టర్ చెప్పారు. భరత్ కు తండ్రి లేకపోవడంతో వాళ్ళ అమ్మ కష్టపడి చదివిస్తున్నది.
జిల్లా కలెక్టర్ నువ్వు పదవ తరగతిలో మంచి మార్క్స్ సాధించి మీ అమ్మకి సంతోషాన్ని ఇవ్వాలని భరత్ కు సూచించారు. పదవ తరగతిలో కష్టపడి చదివి పాస్ అయితే జీవితంలో విజయానికి తొలి మెట్టు అవుతుందని, కష్టపడి చదివి తల్లితండ్రులకు, గురువులకు, జిల్లాకి మంచి పేరు తీసుకరావాలని సూచించారు. భరత్ జీవితంలో స్థిరపడేవరకు సహకారం అందిస్తానని తెలిపారు. అంతేగాకుండా ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతినెల 5000 రూపాయల సాయాన్ని అందిస్తానని చెప్పి వెంటనే ఫిబ్రవరి నెల సాయాన్ని భరత్ కు అందజేశారు. అదేవిధంగా విద్యార్థి చదువుకునేందుకు వీలుగా స్టడీచైర్, రైటింగ్ ప్యాడ్ అందజేశారు.
అనంతరం తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. భరత్ తనకి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని కలెక్టర్ స్వయంగా ఇంటికి రావటం నమ్మలేక పోతున్నానని కలెక్టర్ సర్ రావటంతో తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని తెలిపారు. భరత్ నారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మండల స్థాయి అధికారుల నుండి మొదలుపెడితే జిల్లా అధికారుల వరకు పదో తరగతిలో కాస్త వెనుకబడిన విద్యార్థుల ఇంటి తలుపులు తట్టి వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆయన వెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, స్థానిక పంచాయతీ కార్యదర్శి సుభాష్, శ్రీనులు ఉన్నారు.
0 Response to "District Collector hitting the door of the student's house .."
Post a Comment